Security in Ayodhya as Tirumala : తిరుమల తరహాలో అయోధ్యలో భద్రతా చర్యలు చేపట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు అధికారులు అధ్యయనం చేశారు. బుధవారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టితో ఉత్తర్‌ప్రదేశ్ డీఐజీలు సుభాష్ చంద్ర దూబే, వినోద్ కె.సింగ్‌తోపాటు ఐపీఎస్ అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి తోపులాటలు లేకుండా రద్దీకి తగ్గట్లుగా సమయం కేటాయించి అనుమతిస్తామని తెలిపారు. అవసరమైన ఆహార పదార్థాలు షెడ్లలో అందజేస్తామన్నారు. ఆలయంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్‌వాచ్‌లు అనుమతించమని స్పష్టం చేశారు. భద్రతాపరంగా ప్రతి విభాగానికి ఓ అధికారిని నియమించి పర్యవేక్షిస్తామని వివరించారు. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. తిరుమల ఆలయంతోపాటు జిల్లా అంతటా కట్టుదిట్టమైన భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్లలో తనిఖీ చేసి మత్తు పానీయాలు, పేలుడు పదార్థాలు వెళ్లకుండా నిఘా ఉంచుతామన్నారు. ఆక్టోపస్ టీమ్‌లు నిరంతరం తిరుమలలో శ్రమిస్తున్నాయని, నిత్యం బాంబు, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో యూపీ ఐపీఎస్ అధికారులతో పాటు తిరుపతి అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిపుల్లా, ప్రభాకర్ బాబు, డీఎస్పీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Selfie on Goods Train :గూడ్సు పైకెక్కి సెల్ఫీకి యువకుడి యత్నం...విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు...
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!