తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నేడు ధ్వజారోహణం జరగనుంది. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేయనున్నారు. ఇప్పటికే అంకురార్పణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. 9రోజుల పాటు వేంకటేశ్వరస్వామి వివిధ వాహన సేవలు అందుకోనున్నారు. కరోనా ఆంక్షలతో బ్రహ్మోత్సవాలను.. ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. వాహన సేవలను కల్యాణ మండపంలో.. నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సన్నిధి, పడికావలి, కల్యాణ మండపం.. రంగనాయకుల మండపాన్ని ఐదు టన్నుల పుష్పాలతో అలంకరించారు. శ్రీవారి ఆలయంతోపాటు.. తిరుమల కూడళ్లలో విద్యుద్దీపాలంకరణ చేశారు.
రాష్ట్రంలో మరో ప్రధాన ఆలయం ఇంద్రకీలాద్రిలో.. శరన్నవరాత్రి శోభ కనిపిస్తోంది. సంప్రదాయం ప్రకారం.. విజయవాడ పోలీస్ కమిషనర్ దుర్గమ్మకు మొదటి సారె అందజేశారు. ఇంద్రకీలాద్రి.. రంగురంగుల విద్యుత్ దీపాల్లో మెరిసిపోయింది.
ఇక శ్రీశైలం మహాక్షేత్రంలోనూ.. ఉత్సవ సందడి నెలకొంది. దసరా ఉత్సవాల్లో భాగంగా మిరిమిట్లు గొలిపేలా.. విద్యుద్దీపాలంకరణ చేశారు. ఈ సాయంత్రం.. శ్రీభమరాంబా దేవి భక్తులకు శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లకు.. భృంగి వాహన సేవ నిర్వహిస్తారు.