తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. పంచమీ తీర్థం రోజున శ్రీవారి నుంచి అమ్మవారికి సారె, పసుపు, కుంకుమ, ఆభరణాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. మొదటగా.. మంగళవాయిద్యాల నడుమ సారెను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం కొండపై నుంచి అలిపిరి నడక మార్గంలో సారెతో తిరుచానూరుకు బయలుదేరారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పంచమితీర్థం సందర్భంగా.. శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన సారె శోభాయాత్ర ఘనంగా జరిగింది. అంతకుముందు.. సారెకు తిరుమలలో ప్రత్యేకపూజలు నిర్వహించి తిరుచానూరు తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. నగరంలోని అలిపిరి, టౌన్ క్లబ్, బాలాజీకాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, లక్ష్మిపురం, పద్మావతీ నగర్ మీదుగా తిరుచానూరు ఆలయానికి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులకు సారెను అందజేశారు. అనంతరం.. ఆలయంలో ఏకాంతంగా స్నపనతిరుమంజనం, పంచమితీర్థం నిర్వహించారు. రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి: