వెన్ను, మూత్ర పిండ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచిన చిత్తూరు మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత శివప్రసాద్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద సాయంత్రం 4 గంటలకు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు.
శోకసంద్రంలో అభిమానులు....
రాజకీయ నాయకుడిగా విలక్షణ నటుడిగా రెండురంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ మరణంతో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ అభిమాన నేత శివప్రసాద్ మరణవార్త విని... ఆయన అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. వెన్ను, మూత్ర పిండ సంబంధిత అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన శివప్రసాద్ పార్థివదేహాన్ని తిరుపతిలోని ఎన్జీవో కాలనీలోని స్వగృహానికి తరలించారు.
శివప్రసాద్ సేవలు అభినందనీయం....
శివప్రసాద్ భౌతిక కాయాన్ని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం సహా పలువురు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. దళిత వర్గాల అభ్యున్నతికి శివప్రసాద్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.
కడసారి చూపునకు...బారులు
అభిమానులు, కార్యకర్తలు సందర్శనార్థం తిరుపతిలోని ఆయన స్వగృహం వద్ద శివప్రసాద్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభంకానుంది. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు అభిమానులు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు. అంత్యక్రియల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉంది.
ఇవీ చూడండి