నాయకులు అరెస్టులు, గృహనిర్బంధాలతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి గురువారం అట్టుడికింది. అలిపిరి నుంచి నగరంలోని టౌన్ క్లబ్ ఎన్టీఆర్ కూడలి వరకూ ధర్మపరిరక్షణ యాత్రను ఉదయం నిర్వహించాలని తెదేపా ప్రణాళికలు రచించింది. ఇందుకోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ అనుమతులు రద్దు చేశారు. తెదేపా నేతలు బయటికి రాకుండా ఎక్కడిక్కడ నిర్భంధిస్తూ అరెస్టులు చేశారు.
అనుమతి ఇచ్చి.. మాట మార్చారు:
తిరుచానూరు సమీపంలో తెదేపా నాయకులు బస చేసిన హోటల్లోనే పోలీసులు నేతలను నిర్బంధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, అమర్ నాథ్ రెడ్డి, తెదేపా తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాకలక్ష్మి తదితర ప్రముఖులను హోటల్లోనే ఉంచేశారు. తమకు అనుమతి ఇచ్చారంటూ బయటకు వచ్చేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అలిపిరిలో ఎమ్మెల్సీలు దొరబాబు, నగర మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. టౌన్ క్లబ్ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు బుద్ధావెంకన్న, గౌనివారి శ్రీనివాసులును అరెస్ట్ చేసి చంద్రగిరి స్టేషన్‌కు.. తిరుపతి తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ను ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
రాష్ట్రంలో ఇంటింటింకీ యాత్ర:
యాత్రకి అనుమతులు ఇచ్చి తిరిగి రద్దు చేయడమే కాకుండా.. ఉదయం నుంచి తెదేపా నాయకులపై లాఠీ ఛార్జ్‌లు, అరెస్టులకు పాల్పడ్డారంటూ పోలీసులపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కేవలం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని తొలుత భావించామన్న ఆయన.. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ యాత్రను చేరువ చేయాలని నిర్ణయించామన్నారు. చివరకు దేవుడినీ రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతిలో యాత్రను ప్రభుత్వం అడ్డుకోగలిగింది కానీ ఇంటింటికీ జరిగే యాత్రలను ఆపలేరన్నారు.
ఇదీ చదవండి: