తిరుపతి రుయా ఆస్పత్రి తరహాలోనే తలెత్తిన చిన్నపాటి లోపాన్ని స్విమ్స్ సిబ్బంది అప్రమత్తతతో నివారించారు. మరోసారి అలాంటి విషాదానికి తావివ్వని రీతిలో...అప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతి స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రి...స్టేట్ కొవిడ్ ఆస్పత్రిగా సేవలందిస్తోంది. 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ పడకలు, 40 వెంటిలేటర్లపై...కొవిడ్ రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సిబ్బంది చేసిన పలు సాంకేతిక మార్పులతో...ఊహించని రీతిలో ఆక్సిజన్ సరఫరా జరిగి ట్యాంకులో నిల్వలు తగ్గిపోయాయి.
ఉదయం 4 గంటల సమయంలో ఈ మార్పులను గ్యాస్ ఆపరేటర్స్ గుర్తించారు. రోజూలానే మధ్యాహ్నం పన్నెండున్నరకు చెన్నై నుంచి ఎయిర్‌వాటర్ సంస్థకు చెందిన ఆక్సిజన్ ట్యాంకర్ స్విమ్స్‌కు వచ్చి...లిక్విడ్ ఆక్సిజన్ నింపి వెళుతుంది. ఆస్పత్రిలోని నిల్వలు ఇంచుమించుగా ఆ సమయం వరకూ సరిపోయేలా కనిపించినా...ఏదో జరిగే ప్రమాదం ఉందని అధికారులు శంకించారు. తెల్లవారకముందే స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ...జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌కు విషయం తెలియజేశారు. అప్పటికప్పుడు చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీకృష్ణ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన...ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చేలా చర్యలు చేపట్టారు.
ఏర్పేడు నుంచి తిరుపతికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే తిరుపతి స్విమ్స్‌కు ట్యాంకర్ చేరుకొంది. గ్యాస్ ఆపరేటర్లు చూపిన అప్రమత్తతను అధికారులు అభినందించారు. బల్క్ సిలిండర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రమాదాలకూ తావు లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ వివరించారు.
ఇదీచదవండి
కరోనా రోగుల మృతికి నివాళి: రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల కొవ్వొత్తుల ప్రదర్శన