తిరుపతి పద్మావతి కొవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగిని మృతి చెందడం, ఇద్దరు రోగులు గాయపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి ఏర్పాటులో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల సిబ్బంది, రోగుల ప్రాణానికే ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
2018 ఆగస్టులో పద్మావతి మహిళా వైద్య కళాశాలతో పాటు.. అనుబంధంగా పద్మావతి ఆసుపత్రి, వైద్య సిబ్బంది క్వార్టర్లు, విద్యార్థుల వసతి గృహాలు..ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టారు. తొలి విడతలో 100 కోట్ల రూపాయలతో కళాశాల భవనాలను ఆసుపత్రి మొదటి బ్లాక్ ఐదు అంతస్తులు, రెండో బ్లాక్ రెండు అంతస్తుల నిర్మాణాలను పూర్తి చేశారు. రెండో విడతలో విద్యార్థుల వసతి గృహాలు, రెండో బ్లాకు మూడు అంతస్తులు, ఐసోలేషన్ వార్డు, అంతర్గత రహదారులు.. ఇలా వివిధ పనులను చేపట్టారు. నిబంధనల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. రెండున్నరేళ్లు పూర్తైనా నిర్మాణాలు ఎక్కడికక్కడే ఉన్నప్పటికీ.. ఇక్కడే రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కొవిడ్ ఆసుపత్రి నిర్వహిస్తున్న భవనం పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటనలో.. ఓ ఒప్పంద కార్మికురాలు మృతిచెందారు. చికిత్స పొందేందుకు వచ్చిన ఇద్దరు రోగులూ గాయాలపాలయ్యారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఆసుపత్రి ఏర్పాటు చేయడం..నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద కారణాలపై ప్రభుత్వం.. విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
ఇదీ చదవండి: స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి