Supreme Court CJI: ఎర్రచందనం అక్రమ రవాణాపై నమోదైన కేసుల సత్వర పరిష్కారం కోసం తిరుపతిలో ఏర్పాటైన ప్రత్యేక జిల్లా సెషన్స్, ప్రత్యేక మున్సిఫ్ కోర్టులను గురువారం ఉదయం సీజేఐ ప్రారంభించారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించిన అభినందన సభలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణను జిల్లాలోని న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల సంఘం నాయకులు, బార్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సీజేఐ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ మార్కెట్లో రూ.కోట్లు పలికే అత్యంత విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లోనే దొరుకుతుంది.
చాలాకాలంగా స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లు నరికి, అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభార్జనకు అలవాటు పడ్డారు. పటిష్ఠమైన న్యాయవ్యవస్థ లేకపోవడం, చట్టంలో బలహీనతలతో తక్కువ శిక్షలతో బయటపడతామనే ఉద్దేశంతో పెద్దసంఖ్యలో దీనివైపు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉండటంతో స్మగ్లింగ్ చేసే ముఠాలు పెరిగిపోయాయి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాన్ని సవరించింది. మొదటిసారి పట్టుబడితే అయిదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా.. రెండోసారి దొరికితే ఏడేళ్ల జైలు, రూ.7 లక్షల జరిమానా విధించేలా సవరణ చేసింది. ఇప్పటి వరకు 2,348 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జిల్లా పోర్టుఫోలియో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావ్, ప్రొటోకాల్ జిల్లా సెషన్స్ జడ్జి వై.వీర్రాజు, ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ ప్రత్యేక జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.నాగరాజు, ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ ప్రత్యేక మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రదీప్ కుమార్, హైకోర్టు రిజిస్ట్రార్లు ఎ.వి.రవీంద్రబాబు, డి.వెంకటరమణ, బార్ కౌన్సిల్ సభ్యులు గల్లా సుదర్శనరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దినకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: