Kalamkari: చదువు మధ్యలో ఆపేసిన వారు కొందరు.. చదువు కొనసాగిస్తూ మరి కొందరు.. ఇలా కళంకారీపై శిక్షణ తీసుకుని ఉపాధిని పొందుతున్నారు తిరుపతి జిల్లా మహిళలు. కళంకారీకి ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తికి చెందిన సుధీర్ అనే కళాకారుడి సాయంతో శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని పలువురు మహిళలు... తామున్న ప్రాంతాల్లోనే ఉపాధి పొందుతున్నారు. శ్రీకాళహస్తి, మాధవరం, కె.వి.పల్లె ప్రాంతాల్లో దాదాపు 60 మంది మహిళలు కళంకారీపై ప్రాథమిక స్థాయి శిక్షణ తీసుకున్నారు. చీరలపై రంగులద్దడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఏ మాత్రం అవగాహన లేని కళంకారీ కళలో శిక్షణ ఇవ్వడంతో పాటు తామున్న ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళంకారీ పని నేర్చుకున్నాక ఆర్థిక ఇబ్బందులును ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని అంటున్నారు. వీలున్న సమయంలో పని చేసినా గరిష్ఠంగా నెలకు 13 వేల రూపాయలు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.
" మొదట్లో ఏదీ లేదు. ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్లం. ఆ తర్వాత సుధీర్ అన్న పరిచయమయ్యాడు. మొదట్లో పని నేర్పించాడు. ఇప్పుడు ఐదేళ్ల నుంచి ఆ అన్న దగ్గరే పనిచేస్తున్నాం. ప్రారంభంలో మూడువేలు వచ్చేవి. ప్రస్తుతం రూ.13 వేల వరకు వస్తున్నాయి. ఈ పని వల్ల కొంచెం ఇంట్లో సాయంగా ఉంది. ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ప్రతీదానికి మగవాళ్లపై ఆధారపడకుండా ఈ పని ఉపయోగపడుతోంది. మాపై మాకు నమ్మకం కలుగుతోంది. పిల్లలు డబ్బులు అడిగినా ఇవ్వగలుగుతున్నాం. మనమూ ఏదో ఒకటి చేయగలమనే సంతృప్తిగా అనిపిస్తుంది. చాలా సాయంగా ఉంది." - మహిళలు
చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఒంటరిమహిళగా తన తల్లి పడ్డ కష్టాలను చూసి స్త్రీలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యాన్ని ఎంచుకొన్నట్లు సుధీర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల మహిళలు ఉపాధి పొందుతుండగా...చంద్రగిరి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సుధీర్ చెప్పారు.
" ప్రస్తుతం 60 మందికిపైగా మహిళలు ఈ ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఎంతమందికి వీలైతే అంతమందికి వర్క్ ఇవ్వడం ఒక ఉద్దేశం. రెండోది దీనికి ఒక నిర్మాణం తీసుకురావాలనుకుంటున్నాం. ఒక మహిళ ఇంట్లో బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. నేను సింగిల్ పేరెంట్. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఇంత మందికి ఉపయోగపడుతున్నాను. నా దగ్గర నుంచి బయటికి వెళ్లినవాళ్లు ఇంకో పదిమందికి ఉపయోగపడితే సంతోషమే కదా." - సుధీర్, ఉపాధి కల్పిస్తున్న కళాకారుడు
ఇవీ చదవండి: