రష్యన్ వనిత ఎస్తర్పై ఈటీవీ భారత్-ఈనాడు కథనాలకు విశేష స్పందన వచ్చింది. కరోనా కారణంగా చిక్కుకుపోయిన ఆమెను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు. తల్లి ఒలీవియాతో కలిసి ఫిబ్రవరి 6న భారత్‌కు వచ్చిన రష్యన్ వనిత ఎస్తర్.. లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో గడిపారు. ఆంక్షలు సడలించాక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తాము తెచ్చుకొన్న డబ్బులు మొత్తం ఖర్చవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యారు. డబ్బులు సమకూర్చుకోవడానికి.. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనం పట్టణానికి వెళ్లిన ఎస్తర్ తల్లి ఒలీవియా అక్కడ ఇరుక్కుపోయారు. తల్లి, కుమార్తెలు చెరొక ప్రాంతంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తీరును ఈనాడు-ఈటీవీ భారత్ కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చాయి.
తల్లిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం...
కథనాలపై స్పందించిన ప్రభుత్వం... వివరాలు సేకరించాల్సిందిగా తిరుపతి అర్బన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణభారతి ట్రస్ట్ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్... సూచనల మేరకు భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి ఎస్తర్‌ను కలిసి పరామర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనం నుంచి ఎస్తర్ తల్లి ఒలీవియాను తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
రూ.10వేలు సాయం...
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఫోన్ ద్వారా ఎస్తర్‌తో మాట్లాడారు. తన వంతుగా రూ. 10వేలు సహాయకుడి ద్వారా అందించారు. ప్రభుత్వ నుంచి తగిన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఉపాధికి సాయం చేయండి...
ఆర్థికంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈటీవీ భారత్ ప్రపంచానికి తెలియచేయడంపై రష్యన్ యువతి ఎస్తర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిజియోథెరపీ, వెన్నెముక వైద్యం, ఆలయాల అలంకరణ వంటి వాటిలో నైపుణ్యం ఉందని.. వాటి ద్వారా ఉపాధి పొందేందుకు సాయం చేయాలని కోరారు. తెలుగులో ప్లకార్డు ద్వారా స్థానికులను సాయం కోరాలని ఎస్తర్ భావించినట్టు ఆమెకు ఆశ్రయం కల్పించిన హోటల్ మేనేజర్ పాండురంగ తెలిపారు
ఎస్తర్ రష్యా వెళ్లేందుకు విమాన ఖర్చులు భరిస్తామని డాట్ ట్రావెల్స్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మారమ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 వేలు సహాయం ప్రకటించింది.
ఇవీ చూడండి-కరోనా నుంచి కోలుకున్నాక గుండె సమస్యలు!