Srinivasa Sethu: గరుడ వారధిగా ప్రారంభమై.. శ్రీనివాస సేతుగా మారిన తిరుపతి నగర ఫ్లైఓవర్ నిర్మాణాలకు తితిదే 67 శాతం, స్మార్ట్ సిటీ కార్పొరేషన్, తిరుపతి నగరపాలక సంస్థలు 33 శాతం నిధులు వెచ్చించేలా గతంలో ఒప్పందం కుదిరింది. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉండగా... ఇప్పటికీ యాభై శాతం పనులు కూడా పూర్తి కాలేదు. తితిదే నామమాత్రంగా నిధులు విడుదల చేస్తుండటం నిర్మాణాలకు అడ్డంకిగా మారుతోంది. నిధుల కొరతతో వారధి నిర్మాణాలను రెండు దశలుగా విభజించిన అధికారులు... అతికష్టం మీద తొలిదశ నిర్మాణాలు పూర్తి చేయగలిగారు.
రూ.684 కోట్లతో ప్రణాళిక
Garuda Bridge: ఏడు కిలోమీటర్ల శ్రీనివాస సేతు.. 26 కిలోమీటర్ల ఆకర్షణీయ వీధుల నిర్మాణాలకు 2019లో 684 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించారు. నిధుల కొరతతో కొన్ని పనులను తొలగించటం, మరికొన్నింటిని పరిమితం చేయటం ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని 560 కోట్లకు కుదించారు. ప్రాజెక్ట్ వ్యయం తగ్గించగా... తితిదే తన వాటాగా 375.2 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇప్పటి వరకు వంద కోట్లు మాత్రమే విడుదల చేసిన తితిదే... మరో 275.2 కోట్లు కేటాయించాల్సి ఉంది.
ఇప్పటి వరకు 60శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొదటి దశతో నగరంలో 50శాతం ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండోదశ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. - గిరీషా, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్
ఇదీ చదవండి: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన టికెట్లపై తితిదే కీలక నిర్ణయం