Shivaratri in Srikalahasthi: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని అలంకారం మండపం నుంచి నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవార్లను పట్టణంలోని కైకాల వారి కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. మండపానికి చేరుకున్న దేవతా మూర్తులకు వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజలు, పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్ల మధ్య చండికేశ్వర రాయబారం ఘట్టంతో.. విబూది, ఒక బిల్వపత్రం కట్నంతో... వివాహ నిశ్చయ క్రతువు నిర్వహించారు.
తదుపరి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఆది దంపతుల కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. స్వామి వారి సన్నిధిలో పదుల సంఖ్యలో నూతన వధూవరులు ఒక్కటయ్యారు. కల్యాణ ఆభరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు.... నూతన వధూవరులకు బంగారు తాళిబొట్టు, వస్త్రాలను అందజేశారు.