Srikalahasti Dairy Co-operative Society :తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాల సహకార సంఘం ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు వారిపై దాడికి దిగారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నాయకులను ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చలపతి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే సమయంలో వైకాపా కార్యకర్తలు... మూకుమ్మడిగా ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకుని చలపతినాయుడు కారును ధ్వంసం చేశారు. రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసి కారులోని నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లారు. ఆర్టీసీ కూడలి వద్దకు చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం చేయాలని అంబేడ్కర్ కూడలిలో ధర్నాకు దిగారు.
తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి చెంచయ్య నాయుడు మన్నవరం నుంచి శ్రీకాళహస్తికి నామినేషన్ వేసేందుకు వస్తుండగా ఈడ్రపల్లె వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి పార్లమెంటు మహిళ అధ్యక్షురాలు దశరథ ఆచారి, చక్రాలు ఉషను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తెదేపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
హేయమైన చర్య....
శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్‌కు వెళ్తున్న తెలుగుదేశం నేతలపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. నామినేషన్‌కు వెళ్తున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి చలపతి నాయుడుపై వైకాపా గూండాలు దాడి చేయడం, కారు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎన్నికలంటే వైకాపా ఎందుకు భయపడుతుందని నిలదీశారు. నామినేషన్ పత్రాలు ఎత్తుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు చేస్తున్న వైకాపా నేతలను కట్టడి చేయలేని పోలీసులు నామినేషన్‌కు వెళ్తున్న తెలుగుదేశం నేతలను అరెస్టులు చేయడం, అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
ఇదీ చదవండి: తితిదే ఛైర్మన్ కు.. శిరసు వంచి మోకాళ్లపై కూర్చొని దండాలు పెట్టిన మంత్రి..!