శ్రీవారి దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు రోజుకు ఎనిమిది వేలు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేస్తామన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న ధ్రువపత్రం కానీ, దర్శనం సమయానికి మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకొని తెచ్చుకున్న ‘నెగెటివ్’ ధ్రువపత్రం గాని తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని ఛైర్మన్ తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు.
ఇదీ చదవండి: Tirumala: శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ నటుడు శివారెడ్డి