రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తూ..పాలాభిషేకాలు చేస్తున్నారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారు సప్తవాహనాలపై దర్శనమివ్వనుండగా.. ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్నారు. ఉదయం చినశేష వాహనం, గరుడ వాహన సేవలు, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. కొవిడ్ కారణంగా స్వామి వారి వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా తితిదే అధికారులు పలు సేవలు రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని జయంతోత్సవ వేడుక మొదలైంది. అర్థరాత్రి నుంచే అంగరంగ వైభోగంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన.. ఈసారి తొలి పూజ చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సభాపతి తమ్మినేని సీతారాం, విశాఖ ఐజీ రంగారావు..స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరిగింది. అనంతరం సూర్యనారాయణ స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ గావించి.. పవలింపు సేవతో ఉత్సవం ముగిస్తోంది. టెక్కలిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలోనూ అర్ధరాత్రి నుంచే భక్తులు క్షీరాభిషేకాలు నిర్వస్తున్నారు.
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా రథ సప్తమి వేడుకలు నిర్వహించారు. రాతి రథంపై స్వామి వారిని అధిష్టింప చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గోశాలలో కొలువుదీరిన సూర్యనారాయణ స్వామికి ఆలయ ఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాయంకాలం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని భక్తులు కొలవనున్నారు. విశాఖ గాదిరాజు ప్యాలస్‌లో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా నిర్వహకులు 108 సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర వర్సిటీ యోగా విలేజ్‌లోనూ రథసప్తమి వేడుకలు మెుదలయ్యాయి. రోగ నిరోధక శక్తి పెంచే ప్రత్యేక యోగాసనాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని యోగా విలేజ్ డైరెక్టర్ భానుకుమార్ ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ సూర్య భగవానుని ఆలయం భక్తులతో రద్దీగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి పురస్కరించుకొని అనంతపురం జిల్లా ధర్మవరం యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో యోగాసనాలు వేశారు.
ఇదీ చదవండి : దేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం.. ఎక్కడంటే..?