తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. కొత్త ప్రసూతి వైద్యశాలలో సాయంత్రం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇద్దరు గర్భిణులను అంబులెన్స్ ద్వారా తరలించడం చూసిన రోగుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. జనరేటర్ గదిలో సాంకేతిక లోపం ఏర్పడిందని గుర్తించి.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అధికారుల తీరుపై రోగుల బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. కొత్త జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ ప్రసూతి వైద్యశాలకు చేరుకొని రోగుల బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రోగుల బంధువు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు వెనుతిరిగారు. సాంకేతిక కారణాలతోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని జాయింట్ కలెక్టర్ బాలాజీ వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'అప్పటి వరకూ విద్యుత్ సమస్య ఉంటుంది'