తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడకమార్గం పున:ప్రారంభమైంది. శ్రీవారి మెట్టు వద్ద పూజలు నిర్వహించిన తి.తి.దే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. ఆ తర్వాత జెండా ఊపి భక్తులను తిరుమలకు అనుమతించారు. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు చేరుకునే కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు.. గత ఏడాది నవంబర్ 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు మెట్టు మార్గంలో పెద్ద బండరాళ్లు పడి రోడ్డు, మెట్లు, ఫుట్పాత్లు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయి. అధికారులు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టి.. నడక మార్గాన్ని 3.60 కోట్ల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ మార్గం గుండా ప్రతి రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని తితిదే ఛైర్మన్ తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తూ శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: నడక దారిన వచ్చే శ్రీవారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ: తితిదే ఛైర్మన్