చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలోని వివరాలను క్లుప్తంగా విలేకరుల సమావేశంలో వివరిస్తామని, మీడియా బయటకు వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆదివారం చిత్తూరులో జడ్పీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎజెండాలోని అంశాలపై చర్చిద్దాం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సమావేశం నుంచి దయచేసి బయటకు వెళ్లాలి’ అని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి కోరారు. కవరేజీకి అనుమతించాలని పాత్రికేయులు కోరారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ‘సమావేశాల వివరాలను సమాచారశాఖ ఇస్తుంది. సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్నే అమలు చేస్తున్నాం. వివరాలను సంక్షిప్తంగా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాం.. ఇక మీరు వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. దీంతో పాత్రికేయులందరూ బయటకు వెళ్లిపోయారు. సమావేశం మధ్యాహ్నం 2.45 గంటలకు ముగిసినా విలేకరులకు వివరాలను తెలియజేయలేదు.
ఇదీచదవండి.