కరోనా ప్రభావంతో సామూహిక దీపోత్సవాలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో కార్తిక పారాయణం కార్యక్రమం ద్వారా ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా దీపపూజ నిర్వహించుకునే అవకాశం కల్పించింది ఈటీవీ. ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి 6 గంటల వరకు కార్తిక పారాయణనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అష్టోత్తరాలు, ప్రవచనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు వంటి కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ అష్టోత్తర నామాలను మహిళలు పఠిస్తున్నారు. కరోనా నియమాలు పాటిస్తూ.. బంధుమిత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
గుంటూరులో మహిళలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్తిక పారాయణాన్ని వీక్షిస్తూ.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలతో నీలకంఠేశ్వరుణ్ని పూజించారు. కరోనా కాలంలో ఆలయాలకు వెళ్లి కార్తిక పూజలు చేసుకోలేని వారికి... ఈటీవీ అందిస్తున్న 'కార్తిక పారాయణం' ఎంతో ఉపయుక్తంగా ఉందని మహిళలు అంటున్నారు.
తిరుపతిలో మహిళలు వేద పండితులను అనుసరిస్తూ అష్టోత్తరం పఠించారు. ఆలయానికి వెళ్లలేకపోయామన్న అసంతృప్తిని.. ఈ కార్యక్రమం తీరుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
కార్తిక మాసంలో ఈటీవీ నిర్వహిస్తున్న 'కార్తిక పారాయణం'.. ఇళ్లలో కొత్త కాంతులు నింపుతోందని మహిళలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: టీకా విషయంలో మరో శుభవార్త చెప్పిన మోడెర్నా