తిరుమల కొండపై రెండు రోజులుగా వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. బుధవారం ఉదయం ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు సాధారణంగా కురిసిన వర్షం.. రాత్రి నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడుతోంది. భీకర గాలులతో పాపవినాశనం, కనుమదారుల్లో చెట్లు నేల కూలాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
అర్ధరాత్రి నివర్ తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత పెరిగి... భారీగా వర్షం పడింది. ఉదయం ఐదు గంటల వరకు కురిసిన భారీ వానతో కనుమదారుల్లో హరిణి వద్ద, 14వ కిలోమీటరు వద్ద కొండచరియలు పడ్డాయి. భక్తులు వస్తున్న వాహనం ముందు భాగంలో పెద్ద బండరాయి పడి వాహనం ముందు భాగం దెబ్బతింది. భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కొండచరియలను జేసిబీల సాయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ అప్రమత్తంగా ఉన్నారు తితిదే సిబ్బంది. మొదటి కనుమ దారిలో 56వ మలుపు వద్ద చెట్టు కూలి కొంతసమయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
వేకువజామున స్థానికులు నివాసముండే బాలాజీ నగర్‌లో కమ్యునిటీ హాల్ ప్రహరీ కూలి రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. నివాస ప్రాంగణాలలోనికి వర్షపు నీరు చేరింది. రాత్రి నుంచి ముందస్తు జాగ్రత్తగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భీకర గాలులు, ఎడతెరపి లేని వానతో శ్రీవారి భక్తులు అవస్థలు పడుతున్నారు. నిరాటంకంగా కురుస్తున్న వానతో శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి వరదనీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరు మహద్వారం వద్దకు వస్తోంది. మాడవీధుల్లోని మ్యాన్ హోల్స్‌ని తెరిచి వర్షపు నీరు నిలవకుండా పంపే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వానతో తిరుమలలోని అన్ని జలాశయాలు నిండిపోయాయి. కుమారధార, పసుపుధార జంట జలాశయాలు నిండి పొంగుతున్నాయి.
పాపవినాశనం గేట్లు నిన్న సాయంత్రం నుంచి తెరచి ఉంచారు. గోగర్భం జలాశయానికి అటవీ ప్రాంతం నుంచి భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమల జలాశయాలు గేట్లు ఎత్తడం, కొండల్లోని వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుండటంతో.. తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి:
బలంగా తుపాను ప్రభావం.. కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు