తిరుమలలో గోకులాష్టమి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద వెలసివున్న కాళీయమర్థనునికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళ చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టిన అనంతరం ప్రసాదవితరణ చేశారు.
శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి..
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి నిర్వహించారు. గోసంరక్షణశాలలోని గోపూజా కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు. గోశాలలోని వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాత, దూడకు నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీవారికి నవనీత సేవ ప్రారంభించడం సంతోషంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గోపూజ విశేష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లామని.. వంద ఆలయాలలో గుడికో గోమాత కార్యక్రమం జరిగిందన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: