తిరుమలలో ఐదోరోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారిని చూసి.. భక్తులు తన్మయత్వం పొందారు. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. రద్దీ దృష్ట్యా సమయ నిర్దేశిత దర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 5 వేలమందికిపైగా పోలీసులు, 1650 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖ తెలిపింది.
తిరుమల ఘాట్‌పై ద్విచక్రవాహనాల నిషేధం
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడు సేవ ఇవాళ రాత్రి జరగనుంది. గరుడ సేవను తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. రద్దీ దృష్యా తిరుమల ఘాట్‌పై ద్విచక్రవాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 8 గంటల వరకు కొనసాగనున్నాయి. అలిపిరి లింక్ బస్టాండ్, ఇస్కాన్ మైదానం వద్ద ద్విచక్రవాహనాలు, ప్రైవేటు వాహనాల కోసం.. ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఘాట్ పైకి వెళ్లేందుకు నిమిషానికో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి అలిపిరి లింక్ బస్టాండ్‌కు ఉచిత బస్సు సౌకర్యాలను ఆర్టీసీ అధికారులు కల్పించారు..