ఉచిత సేవల స్థానంలో నిర్వహణా వ్యయం చెల్లించి మరీ నూతన ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే సమయంలో తి.తిదే. అధికారులు చేసిన ప్రకటనలకు.. ప్రస్తుతం అందుతున్న సేవలకు లంకె కుదరడం లేదు. సేవలన్నీ ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. ప్రైవేటు ఏజెన్సీ సేవలు కూడా పాత పద్ధతిలోనే ఉండటం భక్తులను నిరాశ పరుస్తోంది.
గతంలో శ్రీవారి సేవకులు, వివిధ బ్యాంకులు ఉచితంగా అందించే సేవలను.. ఇటీవల బెంగళూరుకు చెందిన కేవీఎం ఇన్ఫోకామ్ సంస్థకు తి.తి.దే అప్పగించింది. లడ్డూ కవర్లు మొదలు అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నెలకు 5 కోట్ల రూపాయల నిర్వహణా వ్యయం చెల్లించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో... లడ్డూ విక్రయ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందుతాయని భక్తులు ఆశించారు.
దర్శన లడ్డూలు, అదనపు లడ్డూలు, వడ, కవర్ల కోసం కౌంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని భావించారు. ప్రైవేటు ఏజెన్సీ బాధ్యతలు తీసుకొని రెండు వారాలు గడుస్తున్నా, సేవల తీరు మాత్రం మారలేదని భక్తులు వాపోతున్నారు. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించిన సేవల్లో మార్పులు లేనప్పుడు, తితిదేపై నిర్వహణా భారం పడటం తప్ప ఉపయోగమేంటనే విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండి:
నేనేం పాపం చేశానమ్మా!..ఏ చెత్తకుప్పలో పడేసినా బతికి ఉండేదాన్ని!