TTD FMS CONTRACT EMPLOYEES AGITATION AT TIRUPATI: తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం ఎదుట ఒప్పంద ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. తితిదే కార్పొరేషన్‌లో తమనూ కలపాలని కోరుతూ ఎఫ్‌ఎంఎస్ ఉద్యోగులు.. ఆరు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా కార్మికులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కానీ.. వారు నిరసన కొనసాగించడంతో.. పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒప్పంద ఉద్యోగులు, పోలీసులకు మధ్య అక్కడ వాగ్వాదం చెలరేగింది. తిరుపతి పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలను పట్టించుకోవాలని.. తితిదేను నమ్ముకుని పనిచేస్తున్న తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
జగన్ సీఎం కావాలని పచ్చబొట్టు వేయించుకున్నానని.. ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నానని ఒక ఉద్యోగిని తెలిపింది. కానీ.. ఇప్పుడు తమకు కష్టాలు తప్పట్లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఎంఎస్‌లో పని చేస్తున్న తమను.. తితిదే కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటూ కోరింది.
వారం రోజులుగా తితిదే పరిపాలన భవన్ బయటే ఉన్నా.. తమ సమస్యేంటని అధికారులు ప్రశ్నించకపోగా నీచంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
''భగవంతుడి సేవను నమ్ముకుని పనిచేస్తున్నాం. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. తితిదే కార్పొరేషన్‌లో మమ్మల్ని విలీనం చేయాలి. మాకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తాం. న్యాయం కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పట్టించుకోరా?'' - ఒప్పంద ఉద్యోగులు
ఇదీ చదవండి:
TTD EO TO PILGRIMS: తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో