జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి... తితిదే ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. యాగశాలలో అర్చకులు, వేద పండితులు గణపతి పూజ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, వాస్తుహోమం జరిపారు. యాగశాలలోని కలశ జలాలను శంకుస్థాపన ప్రాంతానికి తీసుకునిన తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి... శిలను అభిషేకించారు. అనంతరం అర్చకులు అక్కడ శిలాన్యాస పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా నవరత్నాలను ఆ స్థలంలో ఉంచి, వాటిమీద శిలను పెట్టి... చతుర్వేదాలను, అష్టదిక్పాలకులను ఆవాహనం చేసి... పంచగవ్యాలతో శిలను అభిషేకించారు. మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, జితేంద్ర సింగ్, ఎంపీ జగల్ కిషోర్ శర్మ... ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమిపూజ తర్వాత ఆలయ నిర్మాణ నమూనాలను చూశారు. అనంతరం శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆలయ నిర్మాణానికి జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన తి.తి.దే.కి కేటాయించింది. ఈ స్థలంలో రెండు దశల్లో 33.22 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టేలా తి.తి.దే ప్రణాళికలు రూపొందించింది. తొలి దశలో 27.72 కోట్లతో ఆలయం, ఉప ఆలయాలు, యాత్రికుల వసతి గృహాలు, నాలుగుమాడ వీధులు, ప్రాకారం, సిబ్బంది వసతి గృహాలు, వాహన మండపం, విద్యుత్, నీటి సరఫరా పనులు పూర్తి చేయనున్నారు. మలిదశలో 5.50 కోట్లతో వేద పాఠశాల, హాస్టల్ భవనాలు, ఆరోగ్య కేంద్రం, కళ్యాణ మండపం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి పాలకమండలి నిర్ణయం తీసుకుందని తితిదే తెలిపింది. ఇందులో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించింది.
జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు వచ్చే యాత్రికులు... శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చేలా సకల సదుపాయాలు ఏర్పాటుచేయనున్నారు.
ఇదీ చదవండి: