తిరుపతి ఉపఎన్నికలో హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయపార్టీలు.. అదే స్థాయిలో విమర్శలూ సంధిస్తున్నాయి. అత్యధిక మెజార్టీతో దేశమంతా తమవైపు చూసేలా చేస్తామన్న వైకాపా వ్యాఖ్యలపై.. విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలో గెలిచేందుకు అధికార పార్టీ నకిలీ ఓటరు కార్డుల తయారు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఓటు వేసేందుకు స్థానిక ఓటరు రాకపోయినా.. అతని స్థానంలో మరో వ్యక్తిని పంపడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోందని పలు రాజకీయ పార్టీలు అంటున్నాయి.
సీఈసీకి లేఖ:
వైకాపా నాయకులు ఇప్పటికే సుమారు 2లక్షల ఓటరు కార్డులు సృష్టించారని భాజపా, తెదేపా ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారమూ చేస్తున్నాయి. నకిలీ ఓటరు కార్డు అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు.. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెల్లడించారు. ఓటింగ్ శాతం తక్కువ నమోదయ్యే పట్టణ ప్రాంతాల్లోనే.. నకిలీ కార్డులు తయారు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆరోపించారు.
పట్టుకున్నా ఫలితం లేదు:
నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. గడిచిన నగరపాలక, పురపాలిక ఎన్నికల్లో నకిలీ ఓటర్లను పట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజున ఓటరు కార్డుతోపాటు మరో గుర్తింపు కార్డును ఓటర్లు చూపించేలా... నిబంధనలు కఠినతరం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోరుతున్నారు.
కొవిడ్ వేళ మాస్కులు ధరించి దొంగ ఓట్లు వేసే అవకాశముందనీ విపక్షాలు మరో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈసీ పరిశీలించాలని.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని కోరుతున్నాయి.
ఇదీ చదవండి:
లోక్‌సభ ఉప ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన.. సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు