పాల సేకరణ కేంద్రం
చిత్తూరు జిల్లా రైతులకు వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పశుపోషణే జీవనాధారం.. వర్షాభావ పరిస్థితుల్లోను మహిళలు పశుపోషణ ద్వారా సమకూరే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు.. మహిళలకు వెన్నుదన్నుగా నిలచే పాడి రంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇటీవల ప్రభుత్వం అమూల్ సంస్థతో కుదురుకున్న అవగాహన ఒప్పందం మేరకు జిల్లాలో మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.. విడతల వారీగా పశు పోషకులకు బాసటగా నిలిచేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రోజుకు 32లక్షల లీటర్లు..
పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 10.20 లక్షల పశువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు 32-34లక్షల లీటర్ల పాల దిగుబడి జరుగుతోంది. పాల దిగుబడులను పెంచి పశుపోషకులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గ్రామాల వారీగా పశువులు, గేదెలు ఎన్ని..? రైతులు ఎంతమంది..? పాల దిగుబడి ఎంత? స్థానికంగా ఎన్ని కేంద్రాలు ఉన్నాయి..? ఎన్ని లీటర్ల పాలు విక్రయిస్తున్నారు..? తదితర వివరాలను సేకరిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 940 రైతు భరోసా కేంద్రాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు.
నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకే..
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమల్లోకి తీసుకురానుంది. పశువుల కొనుగోలు చేయించి ఆర్థికంగా ఊతమివ్వాలని భావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం అమూల్ సంస్థతో కుదురుకున్న ఒప్పందం ప్రకారం గ్రామాల నుంచి సేకరించిన పాలను.. ఆ సంస్థే మార్కెటింగ్ చేయనున్నట్లు సమాచారం. సకాలంలో పాల రైతులకు నగదు చెల్లించడంతో పాటు.. ఇతరులు ఆ కేంద్రాలకు వచ్చేలా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
72శాతం మేర పూర్తి
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు 940 రైతు భరోసా కేంద్రాల గ్రామాల్లో పశువులు, పాల దిగుబడి వివరాలను సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 72శాతం పూర్తయింది. ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం ద్వారా పశుపోషకులకు ఆర్థిక బాసట దక్కనుంది. - వెంకట్రావు, జేడీ,పశుసంవర్ధక శాఖ