భారీ వర్షాల కారణంగా తిరుమల (Rains in tirumala) కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండవ కనుమదారిలోని హరిణికి సమీపంలో రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ భాగం పూర్తిగా నాని రాళ్లు, చెట్లు విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తితిదే సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని తితిదే (TTD) మూసివేసింది.
జలపాతంలా మెట్ల మార్గం..
తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరాలయం వద్ద జలపాతం జోరుమీదుంది.
జలమయమైన తిరుపతి
తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరమంతా ఎటుచూసినా వర్షపు నీరే దర్శనమిస్తోంది. ప్రధాన కూడళ్లలో భారీగా వరద నీరు నిలవడంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి వెళ్లే భక్తులు, స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. నగరంలోని ప్రధానమైన లక్ష్మీపురం కూడలిలో భారీగా నీరు నిలవడంతో..ఆ ప్రాంతం గుండా రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దేవేంద్ర థియేటర్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుచానూరు రోడ్డు జలమయమయ్యాయి. వెస్ట్ చర్చి, ఈస్ట్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్‌లు నీట మునగడంతో నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల వాహనాల రాకపోకల్ని మళ్లించారు. ఎడతెరిపి లేని వానలతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కపిలతీర్థం, మాల్వాడి గుండం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదఉద్ధృతికి కపిలతీర్థం ఆలయంలో 2 రాతిస్తంభాలు కూలిపోయాయి. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపంలో పైకప్పుతో పాటు గోడ కూలిపోయింది. ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.
తిరుపతిప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోఆగిన వైద్యసేవలు
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. భారీ వరద కారణంగా ఆస్పత్రి విద్యుత్ మీటర్లు మునిగిపోయాయి. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తక్షణమే స్పందించిన వైద్యాధికారులు 50 మంది రోగులనుసిమ్స్‌కు తరలించారు. విద్యుత్ పునరుద్ధరించేవరకు రోగులు ఆస్పత్రికిరావద్దని ఆస్పత్రి సూపరిండెంట్ స్పష్టం చేశారు.
విమానాలు వెనక్కి...
చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల (Rains in ap) కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ (flights diversion over heavy rains) వెళ్తున్నాయి. ఎయిరిండియా, స్పైస్‌జెట్ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగి వెళ్లాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి
Rains in State : చెన్నైకి సమీప జిల్లాల్లో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు, కాలువలు