మొక్కులు చెల్లించుకునేవారు కోర్కెలు కోరుకునేవారు పిల్లల పుట్టు వెంట్రుకలు పుట్టినరోజు, పెళ్లిరోజులు సంవత్సరానికి ఒక్కసారైనా స్వామివారిని దర్శించునేవారు ఇలా నిత్యం కళకళలాడే తిరుమల వెంకటేశుడి సన్నిధి కరోనాతో ఒక్కసారిగా వెలవెలబోయింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో స్వామి దర్శనం సామాన్యుడికి దూరమైంది.
వందల ఏళ్ల నుంచి ఎప్పుడంటే అప్పుడు స్వామి పిలుపు రాగానే బయలుదేరి వెళ్లి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకునే భక్తులకు తిరుమల కొండ ఎక్కడానికే అనుమతి లేకుండా పోయింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టి ఆంక్షలు సడలించినా స్వామి దర్శనానికి తిప్పలు తప్పడం లేదు. టికెట్ ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. దీంతో భక్తుల అవసరాలను ఆసరా చేసుకున్న దళారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో విడుదలయ్యే టిక్కెట్లను పొందలేని యాత్రికులు దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. ఇటీవల కాలంలో నకిలీ టికెట్లు, సిఫార్సులతో భక్తులను మోసగించిన సంఘటనలు అధికమయ్యాయి. హైదరాబాద్, రాయచోటికి చెందిన భక్తుల నుంచి మూడు వందల రూపాయల దర్శన టిక్కెట్ల ఏడింటికి 35 వేల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. గడచిన నాలుగు నెలల కాలంలో 75 కేసుల్లో 250 మందికి పైగా దళారులు అరెస్టు అయ్యారు.
రోజుకు 25 నుంచి 30 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటుండగా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా 16 వేల మంది శ్రీవారిని దర్శించుకొంటున్నారు. ప్రముఖుల సిఫార్సు లేఖలు, పర్యాటక శాఖ, సేవాటిక్కెట్ల ద్వారా మరో పద్నాలుగు వేల మంది దర్శించుకుంటున్నారు. అయితే సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచాలన్న డిమాండ్‌లు భక్తుల నుంచి రోజు రోజుకు అధికమవుతున్నాయి.