రెండు రోజులుగా తితిదేను అలుముకున్న అన్యమత ప్రచార వివాదాన్ని పాలకమండలి ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా ఉన్నతాధికారులు ఖండించారు. తితిదేకు సంబంధించిన క్యాలెండర్... పంచాంగాల డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్పై అన్యమతానికి సంబంధించిన నినాదాలు కనిపిస్తున్నాయనే ప్రచారంపై ఛైర్మన్, ఈవో సంయుక్తంగా వివరణ ఇచ్చారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో పాలకమండలి పెద్దలు మీడియాతో మాట్లాడారు. అన్యమత నినాదాలు కనిపిస్తున్న వెబ్‌సైట్‌తో తితిదేకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్ష పార్టీ... సున్నితమైన అంశాల్లోకి తితిదేను లాగుతుందని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం తితిదేకి లేదంటూ మండిపడ్డారు.
తితిదే వెబ్సైట్లో అసలు అన్యమతానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై గూగుల్ సంస్థ నుంచి వివరణ కోరామన్న ఆయన... నిందితులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని విజిలెన్స్ విభాగాన్నీ ఆదేశించామని తెలిపారు. తితిదేకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసేలా సీఎంకు విజ్ఞాపన పత్రాన్ని అందిస్తామన్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం, ఆర్జిత సేవలు, అభిషేక నిర్వహణల విషయాల్లోనూ తితిదే ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ తీసుకోలేదని ఛైర్మన్, ఈవో స్పష్టత ఇచ్చారు.
సంబంధిత కథనం