ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద పోటుతో తిరుపతిలోని కేటీ రోడ్డు జలమయమైంది. కుండపోత వానలకు రహదారులు జలమయమయ్యాయి. సెల్లార్‌లోకి వర్షపునీరు చేరి వాహనాలు నీట మునిగాయి. రాత్రి నుంచి వానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
స్వర్ణముఖి ఉగ్రరూపందాల్చడంతో...
స్వర్ణముఖి నది పొంగిపొర్లడంతో నగరంలోకి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భవానీనగర్, సంజయ్ గాంధీ కాలనీ, చెన్నారెడ్డి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భవానీ నగర్ కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో వస్తువులు, బియ్యం అన్నీ కొట్టుకుపోయాయి. వరద బాధితులకు పునరావస కేంద్రం కల్పించిన ప్రభుత్వ పాఠశాలలు, ఆలయాల్లోనూ వరద నీరు చేరింది. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా తమను పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు వాపోతున్నారు.
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటి ప్రవాహానికి కొన్ని గ్రామాలకు వెళ్లే దారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు చంద్రగిరి - నరసింగాపురం మార్గంలో వంతెన ఒకవైపు భాగం కుప్పకూలింది. ఎనిమిది గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ వంతెన అర్ధరాత్రి సమయంలో కోతకు గురవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
నరసింగాపురం, మిట్టపాలెం, బుచ్చినాయుడు పల్లి తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలోకి చేరుకున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ అధికారులు జోరు వానలో కూడా మరమ్మతులు చేస్తున్నారు. పోలీసులు నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఉన్న రోడ్లలో పూర్తిగా వాహన రాకపోకలు నిలిపివేశారు. కల్యాణి డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడు గెట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది ఒడ్డునే ఉన్న శివాలయం పూర్తిగా కొట్టుకుపోయింది. కేవలం గర్భగుడి మాత్రమే మిగిలింది. రాత్రి నది దాటేందుకు ప్రయత్నించిన ఓ వాహనం నీటిలో చిక్కుకుపోయింది.
తిరుమల కొండకు రాకపోకలు పూర్తిగా నిషేధం...
కుండపోత వానలకు అలిపిరి మార్గంలోని గురుడా జంక్షన్‌లో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేశారు. తిరుమల కొండకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. రాంభగిచ, లేపాక్షి సర్కిల్, రెండో ఘాట్ రోడ్డులో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్‌రోడ్డులోనూ కొండచరియలు విరిగిపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్డుపై వందలాది వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో రెండో ఘాట్ రోడ్డునూ మూసివేయాలని తితిదే యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి - మదనపల్లె బస్సుల రాకపోకల దారి మళ్లింపు..
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని పించా, బహుదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కలికిరి పెద్ద చెరువు మొరువ తిరుపతి మదనపల్లి మార్గంలో ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులను మహల్, కలికిరి మీదుగా దారి మళ్లించారు. పెద్ద చెరువు మొరవ కొత్తపేటలోని ఇళ్ల మధ్య ప్రవహిస్తోంది. దీంతో కాలువ పై ఓ ఇల్లు కూలిపోయింది. నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వేల ఎకరాల్లో నీట మునిగిన పంట...
చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పట్టణానికి సమీపంలో బాహుదా కాలువకు గండి పడి పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు ధ్వంసం అయ్యాయి. గ్రామీణ మండలం చీపిరి వద్ద ఉన్న వేసవి జలాశయం నుంచి భారీగా వరద నీరు రావడంతో కింది భాగాన ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి మదనపల్లి వ్యవసాయ శాఖ పరిధిలో 550 ఎకరాలు వరి ధ్వంసమైన ఆ శాఖ అధికారులు చెప్పారు.
ఇవీ చదవండి :