తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరాపై లేదని దుయ్యబట్టారు. 10 రోజుల వ్యవధిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. వరుస ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్కలేకుండా శవాల దిబ్బపై రాజ్యామేలాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే మొద్దునిద్ర వీడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతికన ఆక్సిజన్ అందించి కోవిడ్ రోగులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి ప్రభుత్వ హత్యలే: లోకేశ్
రుయా ఆస్పత్రి మరణాలు జగన్ ప్రభుత్వ హత్యలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఆక్సిజన్ అందక 11 మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
'చేతకాకపోతే రాజీనామా చేయండి'
పాలన చేతకాకపోతే సీఎం జగన్ రాజీనామా చేయాలనని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. రుయా ఆసుపత్రి ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానిదే బాధ్యత: నరసింహ యాదవ్
తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: