రాజధాని అంటే అధికార పార్టీకి అపహాస్యంగా ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తిరుపతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించారు. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసింది నదీతీరాల్లోనే అన్న చంద్రబాబు... అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా? హైదరాబాద్ లాంటి రాజధాని మనకు వద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక కష్టాలు ఎదుర్కొన్నామని.. అయినా ఒక్క పిలుపు ఇస్తే రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒక్క పైసా తీసుకోకుండా రైతులు భూములు ఇచ్చారని అన్నారు.
''అమరావతి కోసం చిన్నపిల్లలు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంద్రుడు పాలించిన దేవతల రాజధాని పేరు కూడా అమరావతే. శాతవాహనుల కాలం నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలన జరిగింది. అమరావతిని ఎందుకు మారుస్తున్నారు? నేను తిరుపతి వీధుల్లోనే తిరిగా.. చదువుకున్నా. ఐకాసకు సంఘీభావం తెలపకుండా చిత్తూరు జిల్లా నేతలను అరెస్టు చేశారు. నన్ను సైతం అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు'' అంటూ ప్రభుత్వం, పోలీసులు తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అమరావతి కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.