తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ బంధువు భరత్ యాదవ్ హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైకాపా కార్యకర్తలు గత రాత్రి కత్తులతో దాడిచేయటంతోనే భరత్ యాదవ్ మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తిరుపతిలో ఐదుహత్యలు జరిగాయని మండిపడ్డారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చరని ధ్వజమెత్తారు. ప్రశాంతమైన తిరుపతిని ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
'ఉప ఎన్నిక భయంతోనే దాడులు'
తెదేపా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి తెదేపా కార్యకర్త భరత్ యాదవ్ హత్యను తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భయపెట్టి రాజకీయం చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. అరాచకాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. హత్యలు, దాడులకు వైకాపా సర్కార్ పెద్దపీట వేస్తోందని దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా ఓడిపోతోందనే భయంతోనే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇదీ చదవండి: