ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ రోజుల తరబడి జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో.. సంభవించిన నష్టాన్నిఅంచనా వేయడానికి కేంద్ర బృందం వచ్చింది.
శనివారం తిరుపతిలో విస్తృతంగా పర్యటించింది. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన(flood-affected-areas) ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎమ్మార్ పల్లి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, గొల్లవాని గంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణి గుంట, కొరమేను గుంటలో ముంపునకు గురైన గృహాలు, రోడ్లను పరిశీలించింది.
ఆ తర్వాత తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర రెడ్డి, జిల్లా పాలనాధికారి హరి నారాయణన్, నగరపాలక కమిషనర్ గిరీష.. ముంపు ప్రభావిత ప్రాంతాలను తెలియజేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివరించారు.
కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సైతం కేంద్ర బృందం పర్యటించింది. తిరుపతి నుంచి నేరుగా రాజంపేట చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు.. ముందుగా పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించారు. అక్కడినుంచి మందపల్లి గ్రామానికి వెళ్లి కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అక్కడి నుంచి అన్నమయ్య జలాశయానికి వెళ్లిన కేంద్ర బృందం.. కోతకు గురైన మట్టికట్ట ప్రదేశాన్ని పరిశీలించింది. మట్టికట్ట తెగిపోవడానికి గల లోటుపాట్లను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అపారమైన నష్టం వాటిల్లిందని ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. ఒక్క కడప జిల్లాలోనే 1221 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందానికి కడప ఆర్అండ్ బీ అతిథి గృహంలో వినతిపత్రాన్ని అందజేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందానికి చూపించారు.
చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాల వల్ల పంటపొలాలు దెబ్బతిన్నాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంటా వరద తాకిడికి గురైందని తెలిపారు. చాలాచోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి అని చెప్పారు. తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON JAGAN: 'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'