RENIGUNTA AIRPORT WATER ISSUE: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు తిరుపతిలోని విమానాశ్రయ ఉద్యోగుల గృహ సముదాయానికి.. రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేతపై... కేంద్ర విమానయాన శాఖ విచారణ చేపపట్టింది. తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల తొమ్మిదిన రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ నేతలు అధిక సంఖ్యలో విమానాశ్రయానికి వెళ్లారు. పాస్‌లు లేనివారిని విమానాశ్రయంలోకి అనుమతించలేదు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే... ఏక కాలంలో విమానాశ్రయానికి, ఉద్యోగుల గృహ సముదాయానికి నీటి సరఫరా నిలిచింది. తిరుపతిలో విమానాశ్రయ ఉద్యోగుల నివాస సముదాయం సమీపంలో రోడ్డు తవ్వి మంచినీటి పైపును తొలగించారు.
పదో తేదీ సాయంత్రం ఆగిపోయిన నీటి సరఫరా 12 తేదీ ఉదయం పది గంటల వరకు పునరుద్ధరణ కాకపోవడంతో.. ఉద్యోగులు ట్యాంకర్లతో నీరు తెచ్చుకొన్నారు. తమ అనుచరులను విమానాశ్రయంలోకి అనుమతించకపోవడంపై అధికార పార్టీ నేతలు ఆగ్రహించడంతోనే నీటి సరఫరా ఆపేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు. వైకాపా నేతల తీరుతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఇబ్బందులు పడ్డారని.. నీటి సరఫరా నిలిపివేతపై విచారణ చేయించాలని కోరారు.
ఎంపీ జీవీఎల్ లేఖపై స్పందించిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా... విచారణ చేపడతామని ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు సౌత్‌జోన్ కేంద్రమైన చెన్నై నుంచి అధికారులు రానున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: