ఏపీ లా సెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ళ లా కోర్సులో 92.21 శాతం మంది, ఐదేళ్ల లా కోర్సు లో 76.84 శాతం మంది అర్హత సాధించారు. ఐదేళ్లు, మూడేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ 22న జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జమున తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో విడుదల చేశారు.
3 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం 11,153 దరఖాస్తు చేసుకోగా.. 9357 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 8628 అర్హత సాధించారు. ఐదు సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం 3048 మంది దరఖాస్తు చేసుకోగా... 2591 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అందులో 1991మంది అర్హత సాధించారు. త్వరలో లాసెట్ కౌన్సిలింగ్ నిర్వహించి రాష్ట్రంలోని లా కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తెలిపారు.
ఇదీ చదవండి: Telangana High Court: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్