అమితాబ్ బచ్చన్, సచిన్ తెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రఫెల్ నాడల్. ఈ ప్రముఖులందరిలో ఉన్న ప్రత్యేకత.. 2 చేతులతో రాయగలగటం. ప్రపంచ జనాభాలో ఒక శాతం మందికి మాత్రమే ఇలాంటి అరుదైన నైపుణ్యం ఉంటుంది. ప్రయత్నిస్తే ఇలాంటి అరుదైన, అసాధ్యమైన నైపుణ్యాలు నేర్చుకోవచ్చునని నిరూపిస్తోంది... తిరుపతికి చెందిన యువతి.. అశ్విని. కుడిచేతితో పాటు ఎడమ చేతితో అంతే వేగంగా రాయటంలో నైపుణ్యం సాధించగలిగింది. అందమైన చేతిరాత రాయటంలో అతిచిన్న వయస్సులో అరుదైన ఘనత సొంతం చేసుకుంది అశ్విని. యంగ్ అచీవర్ అవార్డుతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు సాధించింది. 2 చేతులతో రాయటంతో పాటు కుడి నుంచి ఎడమ, కింద నుంచి పైకి, మిర్రర్ రైటింగ్ ఇలా వివిధ రకాల చేతిరాతలతో ప్రతిభ చూపుతోంది.
అనతి కాలంలోనే..
అశ్విని తండ్రి భాస్కరరావు.. తిరుపతి నగరంలో మేక్ మైబేబీ జీనియస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు విద్యాబోధన చేస్తున్నారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు హోల్ బ్రైన్ పవర్, ద బ్రైన్ ద ఛేంజస్ ఇట్ సెల్ఫ్ వంటి పుస్తకాలు పాఠశాల గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అవే అశ్విని... ఆలోచనల్ని మార్చేశాయి. 2 చేతులతో రాయాలనే ఆలోచనకు ప్రాణం పోశాయి. ఇంటర్ సమయంలో సాధన ప్రారంభించి... తక్కువ సమయంలోనే ఆ నైపుణ్యం సాధించింది.
19 భారతీయ భాషలపై దృష్టి
తొలుత తెలుగు, అంగ్ల భాషలు ప్రారంభించిన అశ్విని మిగిలిన భారతీయ భాషలపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా 2 చేతులతో రాయటంతో ప్రత్యేక గుర్తింపు పొందిన వారి వివరాలను అంతర్జాలంలో శోధించి తెలుసుకుంది...అశ్విని. లియొనార్డో డావెల్సీ వంటి చిత్రకారుడు, నికోలస్ టెస్లా వంటి శాస్త్రవేత్తల చరిత్రలు చదివింది. సాధారణంగా 2 చేతులతో రాయలగలిగిన వారు విద్యనభ్యసించిన భాషలకే పరిమితం అవుతారు. అశ్విని ఇందుకు భిన్నంగా ప్రయత్నించింది. లిపి ఉన్న 19 భారతీయ భాషలతో పాటు అరబిక్, అంగ్లం భాషలపై సాధన చేసింది. తెలుగు, అంగ్లం రాయడానికి సమయం తీసుకున్నా.. మిగిలినవాటిపై అతి తక్కువ కాలంలోనే పట్టు సాధించింది.
13 అవార్డులు కైవసం
యంగ్ అచీవర్ అవార్డుతో పాటు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ అమేజింగ్ రికార్డు ఇలా 13 అవార్డులు సొంతం చేసుకొంది అశ్విని. అధిక భాషలు మాట్లాడటంపైనా దృష్టి సారించటమే కాక తనలానే మరికొందరిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.
చిన్నారులకు శిక్షణ
అశ్విని... అందమైన చేతిరాతతో పాటు రెండు చేతులతో వివిధ భాషల్లో రాసేలా చిన్నారులకు శిక్షణ అందిస్తోంది. ఇప్పటివరకు130 మంది చిన్నారుల్లో అలాంటి నైపుణ్యం పెంపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న యువకులకు ఈ చేతిరాతలో తర్ఫీదు అందిస్తోంది. పేద విద్యార్థుల్లో రెండు చేతుల రాత నైపుణ్యం పెంచటం ద్వారా మెరుగైన భవిష్యత్తు అందించేందుకు తండ్రితో కలిసి ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి..