దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ - ఎస్టీ న్యాయస్థానం మూడు రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబు తల్లి మంగారత్నం ఆదివారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియల కోసం రెండు వారాలపాటు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ వేశారు. బాధితుల తరఫున వాదించిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు రెండు వారాల బెయిల్ ఇస్తే ఎమ్మెల్సీ కావడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. వాదప్రతివాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన మూడు రోజుల బెయిల్ మంజూరు చేశారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని.. అంత్యక్రియలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించారు. అనంతబాబు బెయిల్ రావడంతో జైలు నుంచి సోమవారం రాత్రి విడుదలయ్యారు. బెయిల్ సమయంలో పోలీసు ఎస్కార్ట్ ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అదేమీ లేకుండా సొంత వాహనంలోనే అనంతబాబు జైలు నుంచి వెళ్లిపోయారు. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: