తమ ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో పలు కుటుంబాలను వెలి వేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి గుత్తులవారి పేటలో వివాదాస్పదంగా మారింది. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో అరుణ అనే అభ్యర్థి సర్పంచ్‌గా నెగ్గారు. తాము సూచించిన పద్మకుమారి అనే అభ్యర్థికి ఓటు వేయలేదని చాలా కుటుంబాలను గ్రామపెద్దలు నిందించారు. అంతటితో ఆగకుండా తమపై దాడి చేసి గ్రామం నుంచి వెలి వేస్తున్నట్టు ప్రకటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో మళ్లీ కలుపుకోవాలంటే భారీగా సొమ్ము చెల్లించాలని హుకుం జారీ చేశారని చెబుతున్నారు.
ఈ పరిస్థితి నుంచి కాపాడాలంటూ గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కాజులూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా బాధితులంతా ప్లకార్డులు చేతబట్టి ఎదుటే నిలుచున్నా ఆయన కనీసం ఏం జరిగిందని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యర్థుల బెదిరింపులతో ప్రస్తుతం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని.... ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి;