గ్రామాల నుంచి పట్టణాల వరకూ.. వారానికి ఒకరోజు నిర్వహించే సంతలు ఎప్పుడూ వినియోగదారులతో సందడిగా కనిపించేవి. హోల్ సేల్ ధరలకు వస్తువులు ఇక్కడ లభించడం వల్ల సంతలు సందడిగా ఉండేవి. అందుకే రిటైల్ రంగం ఎప్పుడూ కుదేలు కాలేదు. కానీ ఇప్పుడు కరోనా వచ్చి రిటైల్ రంగాన్ని కుదేలు చేసింది. కరోనా వ్యాప్తితో ప్రజలు బయటికి రావడం మానేశారు. ఎక్కువ జనాభా ఉండే సంతలవైపే అసలు చూడటం లేదు. దీంతో సంతల్లో సందడి పోయింది.
తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం మన్యం, మెట్ట, కోనసీమతో పాటు పలు చోట్ల సంతలకు మంచి గిరాకీ ఉంది. మన్యానికి ముఖద్వారం అయిన గోకవరం సంతకు ప్రత్యేకత ఉంది. జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు, పశువులు, జీవాల పెంపకం దారులు విక్రయించేందుకు ఇక్కడికి తరలిస్తుంటారు. ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపులతో సంతలు తెరుచుకున్నా.. వ్యాపారం లేకుండా పోయింది. కూరగాయలు, కిరాణా సరకులు విక్రయదారుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే గోకవరం సంతకు వినియోగదారులు రాకపోవడంతో ఉపాధికోల్పోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా పాజిటివ్ కేసులు