రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలతో సతమతమైన ప్రజలు వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దొంగయ్య అనే వ్యక్తికి చెందిన పూరింటిపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో ఇళ్లు దగ్ధమైంది. సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. చోడవరం పట్టణంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో పొలాలు వర్షపు నీటితో నిండిపోగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ పిడుగులు పడినా ఎలాంటి నష్టం కలగలేదు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన గ్రామాల్లో సాయంత్రం పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెదగొత్తిలి గ్రామంలో పిడుగుపాటుకు పది పశువులు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో ఉన్న జీడితోటల్లో వర్షానికి తలదాచుకోడానికి వచ్చిన పశువులపై పిడుగుపడటంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు తమ పశువులను గుర్తుపెట్టుకొని భోరున విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా మైలవరంలో గత కొద్ది రోజులుగా ఎండలకు ఆపసోపాలు పడిన ప్రజలకు బుధవారం సాయంత్రం కురిసి వర్షంతో ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: