మూషిక: మా బాస్ పుట్టినరోజు వచ్చేసింది... త్వరగా వెళ్లి స్వామికి శుభాకాంక్షలు తెలిపాలి. ఇలా అనుకున్నానో లేదో మీరే వచ్చారు స్వామి.... మీకు వినాయక చవితి శుభాకాంక్షలు...
గణేశుడు: ఆ.. ఆ... ఏం పండుగలే మూషికా...!
మూషిక: ఏమైంది స్వామి... మీరు ఇలా నిరుత్సాహా పడుతున్నారు. మీ పండుగ అంటే భూలోకంలో 11 రోజులు మానవులంతా కలిసి ఘనంగా జరుపుకుంటారు. అంతేనా మీకు ఇష్టమైనవన్నీ నైవేద్యంగా పెడతారు. ఇంకెం కావాలి స్వామి..!!
గణేశుడు: నా పేరు చెప్పుకుని ఎన్ని ఘోరాలు చేస్తారో... నీకు తెలియదు మూషికా...!
మూషిక: అవునా... మీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది.. అసలు వీళ్లు ఏం చేస్తున్నారు?
గణేశుడు: మూషికా.... ఒక్కసారి ఆలోచించు... నన్ను కొంత మంది వారి స్వార్థం కోసం భారీ ఆకారంలో తయారు చేస్తారు. అది కూడా వివిధ రసాయనాలు వాడి... చాలా కలర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఆఖరుగా 11వ రోజు తీసుకెళ్లి నీళ్లలో పడేస్తారు.
మా గంగమ్మ... నన్ను తిడుతుంది. రంగుల రసాయనాలన్నీ ఆమెలో కలిసి... కలుషితమవుతున్నానని...
మూషిక: ఈ మధ్య మట్టి గణపతులు పెడుతున్నారుగా.....
గణేశుడు: ఎక్కడో అక్కడక్కడా మాత్రమే... వీళ్లకి మట్టి గణపతులైతే అందంగా ఉండవని...ఎక్కువ మంది రసాయనాలు వాడేవే కొంటున్నారు.
మూషిక: నిజమా స్వామి?
గణేశుడు: ఏ శుభాకార్యానికైనా... మొదట నన్నే పూజిస్తారు... అంతా బాగానే ఉంది. ఈ 11 రోజులు ఓ నడిరోడ్డుపైనా, ప్రతి గల్లీలోనూ నన్ను పెట్టి పూజిస్తారు. కానీ వచ్చే పోయే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లు ఈ 11 రోజులు ఇబ్బందులు పడాల్సిందేనా?
మూషిక: అవును స్వామి... కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతోంది.
గణేశుడు: అంతేనా మూషికా... పెద్ద సౌండ్ పెట్టి... డీజే పాటలతో డ్యాన్స్‌లు... నావి పెద్ద చెవులు అయ్యాయి కాబట్టి బతికిపోయా... అదే మనిషిలా ఉండుంటే చెవుల్లోంచి రక్తం కారేది.
మూషిక: మీరూ గతేడాది కూడా ఇంకో విషయంపై బాధపడ్డారు గుర్తుకువచ్చిందా స్వామి ?
గణేశుడు: అదీ గుర్తుంది నాకు... బాగా మద్యం సేవించి... కొంత మందైతే.. నాన్ వెజ్ కూడా తిని నా ముందుకు వచ్చి ఎగురుతారు. వాళ్లను లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది.
మూషిక: మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి....
గణేశుడు: ఏం చేస్తాం... ఇది కలియుగం... ఒకవేళ దేవుడే వచ్చి చెప్పినా... వీళ్లు వినరు. యే గ్రహాంతరవాసో అనుకుంటారు
మూషిక: స్వామి మీరు దిగులు పడకండి... మీ నాన్న గారికి చెప్పి వారికి బుద్ధి వచ్చేలా చేద్దాం.
గణేశుడు: మరచి పోయావా మూషికా... కథువా ఘటన... మా నాన్న గారి ఆలయంలోనే.. ఓ ఎనిమిదేళ్ల బాలికపై పలు సార్లు సామూహిక అత్యాచారం చేశారు కొంత మంది కామాంధులు. వారిని ముక్కలు ముక్కలుగా నరికినా తప్పులేదు. తలుచుకుంటేనే ఒళ్లంత మండిపోతుంది.
మూషిక: వద్దు స్వామి మీరు ప్రశాంతంగా ఉండండి...
గణేశుడు: ఎలా ఉంటాను మూషికా... భారతదేశాన్ని భారత మాతగా కొలుస్తారు. అలాంటి ఈ దేశంలో అమ్మాయిలకే కాదు.... 9నెలల పసికందులకు రక్షణ లేకుండా పోయింది. అలాంటి వారిని పుట్టించడమే తప్పు.
మాకు పండుగలు పూజలు కాదు... మనుషులంతా కుల, మత, వర్గ భేదాలు లేకుండా... ఒక్కటిగా బతికి పదిమందికి సహాయపడుతూ ఉంటే అదే చాలు.
మూషిక: బాధపడకండి స్వామి... అలాంటి రోజు త్వరలో రావాలని కోరుకుందాం
గణేశుడు: పదా మూషిక అమ్మ పిలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు ఇష్టమని ఉండ్రాళ్లు చేసిందట... వెళ్దాం పద పద....