తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ఉంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 11.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 10.11 లక్షల క్యూసెక్కులు ఉండగా... డెల్టా కాల్వకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 10.04 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 46.5 అడుగులకు చేరింది. భద్రాచలంలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం...
గోదావరి వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసర సరకులు సరఫరా చేయాలని రెవన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల్లో చిక్కుకున్న దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలకు తక్షణం వరదసాయం చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
బాధిత కుటుంబాలకు 25కేజీల బియ్యం, 2లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, కేజీ వంటనూనే, కూరగాయలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఇతర వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి... బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే ఈ సరకులను వరద ముంపు ప్రభావిత గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించింది.
ఇదీ చదవండి...