Ward Counselor death case : కొత్త సంవత్సరం తొలిరోజే విషాద సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ఉన్నాడు. ఇంతలో వచ్చిన ఫోన్ కాల్ అతనికి చివరి కాల్‌గా మారింది. ఓ మహిళ ప్రాణాలు కాపాడపోయి..తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
జరిగింది ఇదీ...
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం 12వ వార్డు వైకాపా కౌన్సిలర్ భీమవరపు విజయదుర్గ రావు. తనను కలిసిన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా మాట్లాడుతున్నాడు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. తెలిసిన మహిళ ఒకరు అనుమానాస్పదంగా అన్నంపల్లి ఆక్విడెట్ మీద అనుమానాస్పదంగా తిరుగుతోందని.. ఆ కాల్ సారాంశం. కాల్ పూర్తగానే వెంటనే వాహనంపై మహిళ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. దుర్గారావును చూసిన ఆ మహిళ ఒక్కసారిగా గోదావరిలో దూకింది. ఆమెను రక్షించేందుకు దుర్గారావు కూడా నదిలోకి దూకాడు. ఇదంతా గమనించిన స్థానిక మత్స్యకారులు వారిని ఒడ్డుకు చేర్చగా.. దుర్గారావు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ మహిళ 12వ వార్డు వాలంటీరు పెదపూడి లక్ష్మి కుమారిగా గుర్తించారు. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకుంటోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న యువకుడిని కోల్పోయామని స్థానిక ప్రజలు శోకసంద్రంలో మునిగారు.
నగర పంచాయతీ కార్యాలయం వద్ద విజయదుర్గా రావు భౌతిక కాయానికి రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్, నగర పంచాయతీ చైర్మన్, కమిషనర్, వైకాపా, తెదేపా కౌన్సిలర్లు, ఇతర నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎంతో మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న యువకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దుర్గారావు అంతిమయాత్రలో 20 వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Accident: న్యూ ఇయర్ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి