Crop Holiday: కోనసీమ.. పచ్చని పైర్లు, ధాన్యరాశులతో తులతూగే ధాన్యాగారం. అక్కడ దశాబ్దాలుగా ధాన్యంసిరులు పండిస్తున్న.. మోతుబరి రైతులున్నారు.పదెకరాలైనా ధైర్యంగా కౌలు చేసే కర్షకులున్నారు. కోనసీమ రైతులకు తుపాన్లు లెక్కకాదు.. కరవుకాటకాలు.. కరెంటు కోతలు కొత్తకాదు. అవరోధాలెన్నున్నా.. వాటిని దాటుకుంటూ పంటపండిస్తారు. బాలరాజుకూడా అలాంటి రైతే. కొన్నేళ్లుగా.. వరి సాగుచేస్తున్న బాలరాజు..ఇక పంటవిరామం ప్రకటించక తప్పడంలేదంటున్నారు.
బాలరాజు ఒక్కరేకాదు.. పచ్చనిపైర్లుచూసి మురిసినపోయిన రైతులెందరో పంట విరామం బాటపడుతున్నారు.ఐ. పోలవరం,.. ముమ్మిడివరం,.. కాట్రేనికోన అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో అనేక మంది అన్నదాతలు.. దుక్కి దున్నలేమని చెప్తున్నారు.
కోనసీమ వ్యవసాయం ఉసురుతీస్తున్న మరో సమస్య.. డ్రైయిన్ల పూడికతీతలో నిర్లక్ష్యం. తొలకరి వచ్చేస్తున్నా ఇంతవరకూ డ్రైయిన్ల పూడిక తీయలేదు. ఒకవేళ పైర్లువేసినా.. వర్షాలకు నిండా మునగడం ఖాయమని రైతులు నాట్లు వేసేందుకు ముందుకురావడంలేదు. కౌలు రైతులూ జంకుతున్నారు.
పెట్టుబడులు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో... వ్యవసాయం లాభసాటిగా లేదని.. రైతులు పెదవి విరుస్తున్నారు. గిట్టుబాటు ధరలకు కొనకపోగా.. ధాన్యం డబ్బు కూడా సకాలంలో చెల్లించడంలేదంటున్నారు. 2011 తర్వాత మళ్లీ పంటవిరామం ఉద్యమంలా.విస్తరిస్తుండడంతో అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు ఎంత భరోసా ఇచ్చినా కోనసీమ రైతులు మాత్రం పంట విరామంపై వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో రైతులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. సమస్యల పరిష్కారంలో ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనలను రాజకీయ పార్టీలకు ఆపాదించడాన్ని తప్పుపట్టారు. పంట విరామం ప్రకటించడానికి గల కారణాలను వివరిస్తూ.. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఇవీ చదవండి :