Flexi Issue: నెల్లూరు వైకాపాలో ఫ్లెక్సీల గొడవ చినికిచినికి గాలివానలా మారింది. ఇటీవల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రిపదవి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. మాజీమంత్రి అనిల్‌తో ఉన్న విభేదాలు వల్లే ఆయన అనుచరులు తొలగించారనే అనుమానాలు వచ్చాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే...నెల్లూరులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను.. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. నగరంలోని ముత్తుకూరు రోడ్డు సర్కిల్లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీలను చించి వేయడంపై.. అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేమిరెడ్డి ఫ్లెక్సీల చించివేతపై వైకాపాలోనూ చర్చ జరుగుతోంది ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
చర్యలు తీసుకోవాలి: నెల్లూరులో అరాచకం రాజ్యమేలుతోందని ఆనం సోదరులు మండిపడ్డారు. దొంగల మాదిరిగా వచ్చి ఫ్లెక్సీలు చించారన్నారు. నెల్లూరు ఏసీ సెంటర్‍లో ఫ్లెక్సీలు పరిశీలించిన రంగ మయూర్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని.. ఇంటికెళ్లి వచ్చేలోపే కొన్ని ఫ్లెక్సీలు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఎవరో చింపారో ప్రత్యక్ష సాక్షులున్నారు.. సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నాయి.. ఫ్లెక్సీలు చించివేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆడుకుంటూ అడవిలోకి చిన్నారి.. 36 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు