స్థానిక సంస్థల ఎన్నికలు కాకరేపుతున్నాయి. నామినేషన్ల పరిశీలన సందర్భంగా పలు చోట్ల అభ్యర్థులు సరైన పత్రాలు సమర్పించలేదంటూ ఎన్నికల అధికారులు వాటిని తిరస్కరించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే నామినేషన్లను తిరస్కరించారని ఆందోళనలు నిర్వహించాయి.
నెల్లూరులో నగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉద్రిక్తంగా మారింది. 10వ డివిజన్ తెలుగుదేశం అభ్యర్థి, అతని సోదరుడిపై వైకాపా నేతలు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. రిటర్నింగ్ అధికారి ముందే వైకాపా అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌తోపాటు అతని వర్గీయులు దాడి చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నగరంలో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి పురపాలికలో 10, 17 వార్డులకు తెలుగుదేశం అభ్యర్థులు వేసిన నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. దీనిపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితోనే నామినేషన్లు తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి MPTC స్థానానికి జనసేన అభ్యర్థి నామినేషన్ వేయగా అదీ తిరస్కరణకు గురైంది. అధికార పార్టీ ఒత్తిడితోనే నామినేషన్లను తిరస్కరించారని ఆపార్టీ నేతలు మండిపడ్డారు.
గుంటూరు నగర పాలక సంస్థలో.. 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ సుభానీ 32వ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా.. నామినేషన్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు తిరస్కరించారని ఆరోపించారు. భాజపా అభ్యర్థుల నామినేషన్లునూ తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు అధికారపార్టీలో 6వ డివిజన్ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. టిక్కెట్లు అమ్ముకున్నారంటూ కరపత్రాలు ముద్రించడం కలకలం రేపింది.
ఇదీ చదవండి: ఆసక్తి రేపుతున్న కుప్పం పురపాలక ఎన్నికలు