నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పాఠశాలలో సోమ పద్మారత్నం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిత్రకళపై ఆసక్తితో చిన్నప్పటి నుంచే చిత్రాలు వేయడం నేర్చుకున్న పద్మారత్నం.. ఉపాధ్యాయుడిగా తన కళను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. తాను వివిధ రూపాల్లో వేసిన చిత్రాలను.. చదువులో మిళితం చేసి పాఠ్యాంశాన్ని మరింత ఆసక్తిగా బోధిస్తున్నారు. విద్యార్థులు సైతం ఈయన తరగతి అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు.
బోధించేటప్పుడు పాఠానికి సంబంధించిన చిత్రాలను.. విద్యార్థుల ముందే తయారుచేస్తారు. చార్టులు, రావి ఆకులు, కొవ్వొత్తులు, సీసాల్లో బొమ్మలు వేసి.. విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ బోధన కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లుగా విద్యార్థుల కోసం ఆయన వేసిన చిత్రాలను లెక్కిస్తే.. సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠ్యాంశాల తర్వాత వాటన్నిటిని సేకరిస్తూ.. ఇంటి గోడపై ఏర్పాటు చేశారు. అనేకమంది ఈ చిత్రాలను ఆసక్తికరంగా తిలకిస్తూ అభినందిస్తున్నారు.
ప్రముఖుల చిత్రాలు, సామాజిక స్పృహ కలిగించే చిత్రాలు, పండగ విశిష్టతలను వివరించే చిత్రాలు గీసి విజ్ఞానాన్ని, వినోదాన్నిపంచుతున్నారు. పండ్లు, బియ్యం గింజలు, పెన్సిళ్లు, చాక్ పీస్‌లపై, అనేక చిత్రాలు వేశారు. ఆసక్తి కలిగించేలా బోధించి, విద్యార్థులకు చిత్రకళపై అవగాహన పెంచడం ఆనందంగా ఉందని పద్మారత్నం అంటున్నారు. పద్మారత్నానికి చిత్రకళతోపాటు నాటక రంగంలోనూ ప్రావీణ్యం ఉంది. కవితలు, పద్యాలు సైతం రాస్తుంటారు. వాటిలో అనేక జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయుడు తన కళలను విద్యాబోధనలో మిళితం చేసి బోధిస్తున్న తీరును పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: Oilmill Owner Suicide: విజిలెన్స్ అధికారుల వేధింపులు.. కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య