వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని.. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో.. కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీని బలోపేతం చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తెదేపాను గెలిపించాలని కోరారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఓటమి భయంతో వెనుకంజ వేస్తోందని ఆయన విమర్శించారు. తుపాను కారణంగా.. పూర్తిగా పంటలు దెబ్బతిన్న రైతులకు.. నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే రైతులకు 100 శాతం రాయితీతో.. విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు.
అమ్మఒడి కార్యక్రమం నిర్వహిస్తే కరోనా రాదా?
కరోనా సమయంలో ఎన్నికల వద్దంటున్న.. వైకాపా ప్రభుత్వం, వేలాది మందితో అమ్మఒడి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించిందని తెదేపా నేతలు ప్రశ్నించారు. భారీగా విద్యార్థులు, ప్రజలను తరలించి సభ నిర్వహిస్తే కరోనా రాదా అని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరులో నిలదీశారు. అమ్మఒడి కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి.. రూ.వెయ్యి మరుగుదొడ్ల నిర్వహణ కోసం తీసుకోవడం దారుణమన్నారు.
భక్తుల కానుకలు.. నవరత్నాలకు ఉపయోగిస్తున్నారు
భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన నగదును.. ప్రభుత్వం నవరత్నాలకు మళ్లిస్తోందని తేదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తిరుపతి, విజయవాడ, సింహాచలం, అన్నవరంతో పాటు పలు ఆలయాల సొమ్మును ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. ఇందుకోసం అనేక జీవోలను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. హిందూ ధార్మిక సంస్థల సొమ్మును ప్రభుత్వం ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. ఆలయాల సొమ్మును తిరిగి చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: ప్రమాదకర ప్రయాణం..మోపెడ్‌పై రైతు విన్యాసం